ఏరువాకా సాగారో

రోజులుమారాయి సినిమాలో `ఏరువాకా సాగారో రన్నో సిన్నన్న` అనే పాటలో నటించే సమయానికి వహీదా రెహమాన్‌కి పదిహేడు సంవత్సరాల వయసట. జిల్లా కలెక్టరుగా పనిచేసే తండ్రి అంతకు నాలుగు సంవత్సరాల ముందే మరణించారు. హోదా, ఆర్థిక పరిస్థితీ తగ్గాయి.  వహీదా తన సోదరితో కలిసి నాట్యం నేర్చుకొని నాట్యప్రదర్శనలు ఇస్తూ ఉండేది.  ఆమె తండ్రికి పరిచయస్తుడయిన సి.వి.రామకృష్ణ ప్రసాద్ రోజులు మారాయి(1955) సినిమాకి నిర్మాత. వేషం ఇచ్చారు. వహీదా సినిమా మొత్తానికి ఈ ఒక్క పాటలోనే కనిపిస్తుంది. `ఏరువాకా సాగారో రన్నో సిన్నన్న` అని కొసరాజు రాస్తే మాష్టర్ వేణు స్వరకల్పన చేశారు. జిక్కీ హుషారుగా పాడారు. వహీదా రెహమాన్ అభినయం అత్యద్భుతం! 
తరువాత కాలంలో ఈమె హిందీ సినిమాల్లో గొప్ప స్టార్‌కావడం అందరికీ తెలిసున్నదే. భారతదేశ మహా సౌందర్యవతులైన నటీమణుల్లోని  వహీదా ఒకరని చాలా మంది అభిప్రాయం. నేనుకూడా ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తాను :).  ఈ పాట నాకు నచ్చడానికి ఉన్న కారణాలలో ఇది మూడవది. ఒకటవ, రెండవ కారణాలు ఏమిటంటారా? మొదటిది జిక్కీ స్వరం. రెండవది లలితలలితమైన తెలుగు మాటల్లో రైతు జీవనచిత్రాన్ని ఆవిష్కరించే  సాహిత్యం. పాటలోని కొన్ని కొన్ని మాటలు ఇప్పుడు వాడుకలో లేవు. కోటేరు అంటే నేలను ఆనే నాగలికొన అయివుండవచ్చు. పన్నుకో మంటే పట్టుకో మనేనా!? సాలుతప్పక కొందవేసుకోవడం, పడమర దిక్కున వరద గుడేయ్యడం, తట్టిని గమనించడం… లాంటి ప్రయోగాలు ఎంత బాగుంటాయో!    
రైతు దమ్ము చేసుకొని, విత్తనాలు జల్లుకొనే కమనీయ దృశ్యాన్ని మూడవ చరణం నాలుగు మాటల్లో బొమ్మ కట్టడం కవి గొప్పతనం.  మా చిన్నప్పుడు ఉగాదికి కందాయఫలాల్లో ఎవరికి సున్నా లేదో చూసుకొని వాళ్ళచేత ఏరువాక చేయించేవారు. నాగలికి యెడ్లను కట్టి ఒక సాలు దున్నించేవారు. దున్నడం ఒక్క సాలయినా(ఒక పొడవు), నాగలి పట్టుకొన్న ఆనందం సాలంతా(సంవత్సరమంతా) ఉండేది.  ఈ పాట వింటున్నప్పుడు అప్పటి జ్ఞాపకాలన్ని వచ్చి కళ్ళముందు నిలుస్తాయి. 
 ఓ.. ఓ.. ఓ.. ఓ..
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా                 
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
నవధాన్యాలను గంపకెత్తుకుని
చద్ది యన్నము మూటగట్టుకుని
ముల్లుగర్ర నువు చేత బట్టుకుని 
ఇల్లాలును నీ వెంటబెట్టుకుని                    
పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు కురిసె           
వాగులు వంకలు వురవడి జేసె
ఎండిన బీళ్ళు చిగుళ్ళు వేసె                     
కోటేరును సరిజూసి పన్నుకో
యెలపట దాపట యెడ్ల దోలుకో
సాలు తప్పక కొంద వేసుకో
యిత్తనమ్ము యిసిరిసిరి జల్లుకో                
పొలాలమ్ముకుని పోయేవారు
టౌనులొ మేడలు కట్టేవారు
బ్యాంకులొ డబ్బు దాచేవారు
ఈ తట్టిని గమనించరు వారు                     
పల్లెటూళ్ళలో చల్లనివాళ్ళు
పాలిటిక్సుతో బ్రతికేవాళ్ళు
ప్రజాసేవయని అరచేవాళ్ళు                      
ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు                     
పదవులు స్థిరమని భ్రమిసేవాళ్ళే
ఓట్లు గుంజి నిను మోసేవాళ్ళే
నీవే దిక్కని వత్తురు పదవో                         
రోజులు మారాయ్! రోజులు మారాయ్!
మారాయ్! మారాయ్! రోజులు మారాయ్!  
మీకు కూడా ఈ పాట ఇష్టమేనా?
© Dantuluri Kishore Varma 

2 thoughts on “ఏరువాకా సాగారో

  1. తెలుగు అమ్మాయి ఐన ఆమెఒకసారికూడా తెలుగుసినిమాల ద్వారా పైకి వచ్చిన సంగతి,తన తెలుగు rootsవిషయం చెప్పకపోవడం శోచనీయం.బాంబే వెళ్ళగానే అతిశయం పెరిగి పోయిందనుకొంటాను.

  2. ఆమె తెలుగు అమ్మాయి కాదట సర్. వీకీపీడియా వాళ్ళ సమాచారం ప్రకారం చెన్నైలో చెంగల్పట్టు ప్రాంతం వాళ్ళట. కాకపోతే ఆమె తండ్రి రాజమండ్రీలో ఉద్యోగం చేశారు. మొన్న ఏప్రిల్ పదిహేనవ తేదీన వహీదా రెహమాన్‌తో కబుర్లు `డౌన్ ద మెమొరీ లేన్` అని ఒక ఆర్టికల్ ప్రచురించారు. అక్కడ తన సినీ ప్రస్థానం తెలుగు సినిమాలతో మొదలయ్యింది అని ఆమె చెప్పిన మాటల్ని కోట్ చేశారు.

Leave a comment