విన్నీ-ద-ఫూ

విన్నీ-ద-ఫూ గురించి విన్నారా ఎప్పుడయినా? లేకపోతే ఈ బొమ్మ చూస్తే మీకు వెంటనే తెలిసిపోతుంది విన్నీ ద ఫూ ఎవరో. దానిగురించి ఒక మంచి కథ చెపుతాను వినండి. కథ అంటే కథ కాదు కానీ, నిజ్జంగా జరిగిందే. 
క్రిస్టొఫర్ రాబిన్స్ అని ఒక కుర్రవాడు ఉండే వాడు లండన్లో. వాళ్ళ నాన్న ఏ.ఏ.మిల్నే పెద్ద కథా రచయిత. మిల్నే రాసిన విన్నీ-ద-ఫూ కథలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వాటిలో ముఖ్యమైన పాత్రలు – క్రిస్టొఫర్ రాబిన్స్, విన్నీ అనే పేరుగల ఒక ఎలుగుబంటి, ఈయోర్ అనే గాడిద, రూ అనే కంగారూ పిల్ల, ఒక పులీ… మొదలైనవి ఉన్నాయి. మిల్నే కొడుకు పేరు క్రిస్టొఫర్ రాబిన్స్ అని ముందే చెప్పుకొన్నాం కదా? వాడే ముఖ్య పాత్ర..  క్రిస్టొఫర్ ఆడుకొనే బొమ్మల పేర్లనే కథల్లో కొన్ని పాత్రలకి పెట్టాడు.
మొదటి ప్రపంచ యుద్దం జరుగుతున్న రోజుల్లో ఒక సైనికాధికారి కెనడా నుంచి ఇంగ్లాండ్ వస్తూ మార్గ మధ్యలో ఒక నల్ల ఎలుగు బంటిని కొంటాడు. దాన్ని తన రెజిమెంటులో పెంచుకొంటూ ఉంటాడు. అది అక్కడ చాలా పాపులర్ అవుతుంది. దాని పేరు విన్నీ. తరువాత కొన్నిరోజులకి విన్నీని లండన్ జూకి అప్పగిస్తాడు. ఒకసారి క్రిస్టొఫర్ రాబిన్స్ జూలో దాన్ని చూసి, ముచ్చటపడి, తనదగ్గర ఉన్న టెడ్డీబేర్‌కి ఆ పేరు పెట్టుకొంటాడు.

మరి ఫూ అని ఎందుకు కలిపారు? అంటే, దానికి ఇంకొక కారణం ఉంది. ఒకసారి లండన్ జూలో ఉన్న విన్నీకి చాలా నీరసం చేసిందట. చేతులు కర్రల్లాగ బిర్ర బిగుసుకుపోయాయి. అలా వారం రోజులు ఉంది. ఆ సమయంలో దాని ముక్కు మీద ఏమయినా వాలితే `ఫూ(((` అని ఊదుకొనేదట. అందుకే ఆ శబ్ధాన్ని కూడా కలిపి విన్నీ-ద-ఫూ చేసారు. 

మొట్టమొదటి విన్నీ-ద-ఫూ కథలు 1926లో రాయబడ్డాయి. తరువాత వాల్డిస్నీ వాళ్ళు ఈ పాత్రల్ని ఆధారంగా చేసుకొని  మంచి, మంచి యానిమేటేడ్ సినిమాలు తీసారు. మీరు ఎప్పుడయినా వాటిని చూసే ఉండవచ్చు. చాలా బాగుంటాయి కదా?

© Dantuluri Kishore Varma

Leave a comment